Tuesday, October 25, 2011

ప్రేమాంతరంగం - సంఘర్షణ తికమకపడే ప్రేమజంటలు


అనురాగపు రూపమేదో
బోసినవ్వులతో
వెన్నముద్దలు కురిపిస్తున్నప్పుడు
పాక్కుంటూ
అడుగులేసే పాదాలను
పువ్వుల్లా ముద్దాడాలని
హద్దులు చెరుపుకుంటూ
ఎగిరొచ్చే పక్షుల్లా పెద్దలు

లాలించే పసితనానికి
సహకారం అనివార్యమై
కదిలేదైనందినానికి
పనితోడవసరమై

అవసరం
అనివార్యాల నడుమ
సంఘర్షణ
అనురాగాలో
ఆత్మీయతలో
ఆసరా చేస్కొని
కొత్తరాగాలను కూర్చుతూ
నిశ్చలనీటిపై
వలయాల వలయాలుగా
సరికొత్తబంధాలతో
బిందువులేవో రాలుస్తుంటే
అర్థంకాని భవిష్య నిర్మాణపు
పునాదులేవో తవ్వుతూ
ప్రేమజంటలు

****

అప్పుడప్పుడూ
విడదీసే
భౌతికాకృతి తేడాలు
ఋతుక్రమంలో మారుతుంటే
అరోగ్య అనారోగ్యాల మధ్య
శరీరం వూగిసలాడుతూ
మారే శరీర రసాయనాల్లోచి
అనుమానం పొడచూపి

కదలికల స్పర్శలను
తూకంవేస్తూ
పడికట్టురాళ్ళేవో వెదకుతూ

సంఘర్షించే ఆలోచనల్తో
మానసికమో

శరీర మార్పుల్తో
వైజ్ఞానికమో

సామాజిక అసమానల్తో
సాంఘికమో

అంతఃవిభేదాల్తో
కుటుంబమో

అవసరాల్తో
ఆర్థికమో

ఒకదాని వెంబడి వోకటి
ఒకదానితో వొకటి పెనవేసి
ఒక్కసారి ఆనంద కెరటాలై
మరొక్కసారి
జీవనం అగాధమై
ఎదురౌతుంటే

ప్రేమనే సందేహిస్తూ
తికమకపడే
ప్రేమజంటలు

No comments:

Post a Comment