Wednesday, November 9, 2011

జీవితం


నల్లని మేఘం కప్పుకున్నప్పుడే
కోకిలవయ్యావు

పంటికిందో కంటికిందో నొక్కి
కురవని మేఘాలై కదలి
విశాలాకాశమై విస్తరించేవు

ముడుచుకున్నది మౌనమొ
కడుపులోకి మోకాలో
పదుగురికి పంచిన
పరమాన్నమై పలుకరించేవు
భావాలు మేఘాలై
వర్షిస్తున్న ఆకాశంకింద
అలలు అలలు
అనుభూతుల వెన్నెల మేళాలు
సంఘర్షణలతో
ఎగసిపడే కెరటాలు
సంబంధాల నడుమ
ఆవిరయ్యే ఉపరితలాలు

ఎల్లలెరుగక
విశాలంగా విస్తరించే జలాలు
శాశ్వతంగా బందించే
లోతైన నిధులతో ప్రేమొక సముద్రం
పైకి కంపించేదేదీ లొనుండదు
లోనున్నదేదీ పైకి కంపడదు
విచిత్ర లావణ్య గర్భంలో
రహస్య నిలయం

విచ్చిన్నమై సమైక్యపడుతూ
సమక్యపడి రూపాంతరమౌతూ
నిక్షిప్త వలయాలుగా
తరంగమై ఎగసిపడుతుంది

నిర్దిష్ట నియమాల దారులేవీ
నిర్మించుకోదు
ఏ తిరానికీ దిక్సూచి కాదు
కలై
కన్రెప్పల అద్దంపై వాలి
పొడుస్తూనే వుంటుంది

రెప్పతెరిస్తే
కలా వుండదు పిచ్చుకా వుండదు
జ్ఞాపకమైన శబ్దాన్ని
హృదయంలోకి పిండుకోవడమే
తరంగం
పదికాలాలు దాచుకోవడమే
జీవితం

నిరంతరం
వెల్లువెత్తే తరంగాలలో
"నేను నిన్ను ప్రేమిస్తున్నాను
అని చెప్పినంత తేలిక కాదు
ఇంకా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం "

నాట్లేసిన పైరులా
యవ్వనంఊగుతోంది

ఇరువురొక్కగానమై
రేపటి పంటై ఫలించాలి

Tuesday, November 8, 2011

నడిచొచ్చిన అడుగులే సమాధానం

At the end of the day, its just you and me


తెగించి
ఓ స్వప్నాన్ని పట్టుకున్నాను
అప్పుడప్పుడె రెక్కలొచ్చిన
సీతాకొకచిలకల్లా
నీ నవ్వులు ఎదురయ్యాయి

ఇప్పుడే విచ్చుకుంటున్న
విప్పపూతలా
నీ చూపులు తడిమాయి

ప్రణయమో
పాశమో
ఒక్కదేహానికి రెండుచేతులమై
చెరొప్రక్క
బతుకు ప్రవాహాల ఈదులాట

సవాళ్ళెక్కుపెట్టిన
సవాలక్ష నోళ్ళకు
నడిచొచ్చిన అడుగులే సమాధానం

మెలిపెట్టిన ప్రతిక్షణం
తళుక్కుమన్న మెరుపై
ఇంకో క్షణాన్ని తెస్తుంది.

Saturday, November 5, 2011

నవ్యరాగ ఆనందమయ గీతమౌతుంది

అడుగుల బంధంతో
కలిసి నడుస్తున్నప్పుడు
కనులేవొ కుడుతుంటాయి

మమకారాల మధ్య
కారం చల్లి
వినోదిస్తుంది లొకం

తరంగమై విరిగిపడినా
తీరంచేరినా
ఎగసిపడటమే ముఖ్యం

ప్రేమికులొక్కటై
అనుబంధాలకు
మరొ పేగుబంధాన్ని ముడివేయాలి

ప్రేమకు ప్రేమ తప్ప
మరేదీ సాటిలేదని
లోకానికి ఛాటిచెప్పాలి
సముద్రమైన ప్రేమను
జొంటగా ఈదుతూ
ఎవ్వరెరుగని
లోతులను కనుగొని
రహస్యాల్ని వెలికితీసి
వెదజల్లాలి దారుల నిండా.

ప్రేమిస్తున్నానని కాక
ఇంకా ప్రేమిస్తున్నానని
ఎప్పుడైనా
ఎక్కడైనా చెప్పగలగాలి

ప్రేమ కథలకు
కొత్తముగింపు వాక్య మవ్వాలి

కెరటాలై ఎగసిపడుతుంటే
మొదలు ముగింపుల మధ్య
కణాలతో సతమతమయ్యే
ప్రేమజంటలు

* * *
ఓ చెలీ
ఓచెలికాడా!
విభేదంమొలకెత్తినప్పుడు
ఒంటరితనం
అజ్ఞాతమిత్రుడై ఆహ్వానిస్తుంది

కరచాలనమో
కౌగిలింతో కొరుతుంది

నీ స్పర్శలేని భుజంపై వాలి
బరువెక్కి బరువెక్కి
వర్షించలేని కన్నుల్లో దాక్కుంటుంది

అంతటా
నైరాశ్యపు రంగు పులుముకొని
నిన్ను దూరంచేస్తుంది
నీ నుంచి నిన్ను దూరంచేస్తుంది

నీ స్పర్శకోసం
ఆ భుజం ఎప్పుడూ
ఖాళీగానే
సాదరంగా ఎదురుచూస్తుంది.
***

వేర్వేరు భావాలతో
విహరిస్తున్నప్పుడు
పరస్పరం
సంఘర్షిస్తూనే వుంటుంది కాలం

నిదురలేచి
పక్క దులిపినట్టు
భావాల్ని దులపాల్సిందే

ఒక్కసారి మనసు తెరచి
ఒకొక్క మాటను పాటచేసి
పాడాల్సిందే!

జ్ఞాపకాలు వర్షించే కనులై
కొత్తగీతాన్ని ఆలపించాల్సిందే!

ధృడమయ్యే బంధం కోసం
స్పర్శించాల్సిందే!

* * *

ఇప్పుడభినందిస్తున్న వాళ్ళ
ద్వేషిస్తున్న వాళ్ళ
ముఖాల రంగులు మార్చడం
జయాపజయాల పోరాటం

విజయాల ంధ్య
అందరు సన్నిహితులే
తోడెవ్వరూలేని ఓటమిలో
మిగిలేది
జంటలమధ్యవున్న
ప్రేమ స్పర్శ మాత్రమే!

ఆటుపోటుల సమరంలో
కడదాకా నిలిచి
కంపించే జంటలు
పొంగిపొర్లే సెలయేర్లులా
మోసుకుపోతున్న విధ్య్తు తు  ప్రవాహం
యెదనుండి యెదకు
తరంనుంచి తరానికి
వారథిచేస్తూ పాడినప్పుడే
ప్రేమగీతమైన జీవితం
చిరుకొమ్మల చిగురుల్లో
ఊయలూగే
చిలకలుపాడే కిలకిలరావాల
నవ్యరాగ ఆనందమయ గీతమౌతుంది

Thursday, November 3, 2011

ప్రేమాంతరంగం - అనుబంధం


మంచుగడ్డలా
కరిగినమోహంలో
మొలకెత్తే కలతల మొలకల్లో
లోకాన్ని శాసిస్తున్న
ధనం
మనసుకు ఇంధనాన్ని చేసి
తృప్తి
అసంతృప్తుల మధ్య
వూగుతూ
సమతుల్యాన్ని వదలి
అసమానతల్లో మునిగి
ఒకరికొకరు
ద్వేషదూషణలతో
అసహనాన్ని మాటలుగా
వెదజల్లుతున్నప్పుడు

అహం
అడ్డుగోడల్ని కడ్తుంది

సహనం
ముళ్ళపై నడక్పుతుంది

అనుమానం
వేధించే భూతమౌతుంది

ఆలోచనలు
ఆజ్యాలై
జ్వాలలు జావలు
విచ్చిన్నమయ్యే
స్వాగత పలుకులేవో పలుకుతూ
ప్రలోభాల్లోపడి
బ్రమపడుతున్న
ప్రేమజంటలు

* * *

మనసులొ మాటను
నాలుకపైనే లాక్కున్నట్టు
మమేకమయ్యే అనుబంధం
ఒకనాటిది కాదు

భావాల భాష్యీకరణం
రెండు ఆలొచనల
ఏకికరణం
హృదయ అంతఃసీమల్లోచి
మౌనాన్నొ స్పర్శనో
అక్షరీకరిస్తూ
జయాపజయాల
కాలపు ఆటలలో
పురిపేనిన బంధమై
కలి నిలవడం

అలలైన క్షణాలనుంచి
చిగురించే వసంతాల్లోకి
పచ్చదనమేదో మోసుకుపోతూ

ప్రేమజంటలనుండి
ఒకరికొకరైన జంటలై
దిక్సూచులుగా నిలచే
ప్రేమజంటలు

* * *

పిరికివాళ్ళు ప్రేమకనర్హులని
నడిచిన ఏడడుగుల్లో
పలికిన ప్రమాణాలలో
నీవు నేను వేరుకాదని
నేను నివు సమానమని
వదిలొచ్చిన
అనుబంధాలు
అడుగుల సాక్షిగా
కొత్తతీరాలకు
సరికొత్త విజయాలకు
బాసట మనమయ్యేచోట
అధిరోహించాల్సిన
శిఖరాలు మనవేనని
నిరంతరం
నడుస్తున్న అడుగుల్లో
అనుక్షణం నిరూపించలేక
కుతకుత వుడుకుతున్న వేళ
సడలిన ధైర్యంతో
ప్రేమకు ముగింపు
ప్రాణార్పణం కాదు!

అవమానంలో
ఆవేదనలో
ఆకలిలో
స్పర్శ
విజయశిఖరానికి
మలుపౌతుంది
***