Wednesday, July 21, 2010

ప్రేమ గెలుపు

ప్రేమ గెలుపు


ఇరువు ఒక్కటవ్వటమేనని

జీవన భాగస్వామ్యానికి

ఎవరికివారే పరిథులు గీసుకుంటూ

ఎవరికివారే నిర్వచించుకుంటూ

నిరంతరవలయాలలో చిక్కుకుంటూ

తరంనుంచి తరానికి

వారధులేవో నిర్మిస్తూనో

అగాథాల్ని సృష్టిస్తూనో

తరంగమై ఎగసిపడే జంటలకు

ఒక్కసారి ఆలింగనమయ్యాక

ఈదవసిందే!

పయనించాల్సిందే!



పట్టుదొరికితే ప్రతి అడుగూ


కొలంబస్ మోపిన పాదమే అవుతుంది


టెన్సింగ్ నార్కే ఎగరేసిన జెండా అవుతుంది

Wednesday, July 7, 2010

ఎవరినైనా ప్రేమించాలి

ఎవరినైనా ప్రేమించాలి

అచేతనపు బీడుల్లో

వొంటరితనాన్ని ఈదుకుంటూ

చేతనాలింగన

ఎదురుచూపుల కోసం

ఎడారి ఇసుకల్లోంచి

జారిపోయిన వసంతాలు

వెదలేని కన్నుల్లో

ఖర్జూరపు తీపికోసం

ప్రవాహ తీరాలకోసం

***

ఎవర్ని ప్రేమించాలి?

ఎప్పుడు ప్రేమించాలి?

ఎలా ప్రేమించాలి?


వ్యక్తపరచలేని ప్రేమభావం

విచ్చుకోని మొగ్గౌతుంది

చూపులు కలిసిన శుభఘడియేదో

ఆత్మలను కలుపుతుంది

గాలి చొరబడని కౌగిలింతేదో

బందీల్ని చేస్తుంది

***


పరిమళించిన పథాలలో

నడిచారో, పరుగెత్తారో, అలసిపోయారో

స్విచ్ వేయగానే గిర్రున తిరిగే ఫేనులా

కాలమేమి తిరగదు

ఒకరికొకరుగా ప్రీతిచేయడానికి

మనకు మనంగా శృతిచేయడానికి

మధ్య మధ్య ప్రవేశిస్తూనే వుంటుంది

వడిసి పట్టుకోవడం

మెలిపెట్టడం

సహనాన్నో బందాన్నో పరీక్షించడం

నడిపించడం పరుగులెత్తించడం

ఏడ్పించడం నవ్వించడం

దూరం చేయడం దగ్గరవ్వడం

కళ్ళలో కలలు నింపడం

దానికి వెన్నతో పెట్టిన విద్య

ఎవర్ని గెలిపిస్తుందో

ఎవర్ని ఓడిస్తుందో

బహుశ

తను అలసినప్పుడు

మరో జంటను వెతుకుతుంది

దాని వెతకడం ఆ జంట వంతౌతుంది.