Monday, October 17, 2011

ప్రేమాంతరంగం - పెళ్ళంటే


పెళ్ళంటే
రెండు వ్యక్తిత్వాల నడుమ వారథి
రెండు కుటుంబాల అంతఃప్రవాహం

పెళ్ళంటే
బంధాల మడతబందుల పనితనం
కిటికీలుగానో
తలుపులుగానో
తమను తాము బిగించుకోవడం
పెళ్ళంటే
కాలం తీస్తున్న కెమేరాల్లోంచి
పలుకరించే వర్ణచిత్రం

ఏ కోణంలో
ఎవరు క్లిక్ చేస్తారో?
నిలువుగా వస్తుందో?
అడ్డంగా వుంటుందో!
మూల్లలకు
భావాల మేకులెవరు కొడతారో!
ఖాళీలకు ఆత్మీయ 'గమ్మె ' వరు పూస్తారో!

ఏదీ ఖచ్చితం కాదు
ఏదీ నిశ్చయంలేదు
అంతా తయారైన ఫ్రేములో
ఎవరు నిల్చి అగుపిస్తారో!

మారే ఫ్రేముల నడుమ
కాలమే నిలువుటెత్తు
నిశబ్దసాక్షి

పెళ్ళిసందడొక  సాకు
ఆత్మీయతలో అనుబంధాలో
ఒక్కచోటచేర్చే
కలబోతల ద్వారం

ఆడంబరాల అంతస్తునేదో
ప్రదర్శించే మార్గం

పీతాంబరాలు
కర్పూరదండలు
సాంప్రదాయాల తోరణాలు
పసుపు వాసనలతో
నిలుపుకున్న సంసార బంధం
ముత్తైదువుల ముచ్చట్ల మధ్య
దీవెనలకోసం
అక్షతలు చల్లే చేతులను
సాక్షులుగా నిలపడం

మోయాల్సిన కాలానికి గుర్తుగా
మెడలో దండలతో
ఆశీర్వాదాలను స్వాగతిస్తూ
ప్రేమజంటలు



4 comments:

  1. బాగుందండీ! నాకు తాపీ ధర్మారావు గారు రచించిన పెళ్లి దాని పుట్టు పూర్వోత్తరాలు అనే పుస్తకం గుర్తుకొస్తోంది ఇది చదువుతుంటే!

    ReplyDelete