Wednesday, November 9, 2011

జీవితం


నల్లని మేఘం కప్పుకున్నప్పుడే
కోకిలవయ్యావు

పంటికిందో కంటికిందో నొక్కి
కురవని మేఘాలై కదలి
విశాలాకాశమై విస్తరించేవు

ముడుచుకున్నది మౌనమొ
కడుపులోకి మోకాలో
పదుగురికి పంచిన
పరమాన్నమై పలుకరించేవు
భావాలు మేఘాలై
వర్షిస్తున్న ఆకాశంకింద
అలలు అలలు
అనుభూతుల వెన్నెల మేళాలు
సంఘర్షణలతో
ఎగసిపడే కెరటాలు
సంబంధాల నడుమ
ఆవిరయ్యే ఉపరితలాలు

ఎల్లలెరుగక
విశాలంగా విస్తరించే జలాలు
శాశ్వతంగా బందించే
లోతైన నిధులతో ప్రేమొక సముద్రం
పైకి కంపించేదేదీ లొనుండదు
లోనున్నదేదీ పైకి కంపడదు
విచిత్ర లావణ్య గర్భంలో
రహస్య నిలయం

విచ్చిన్నమై సమైక్యపడుతూ
సమక్యపడి రూపాంతరమౌతూ
నిక్షిప్త వలయాలుగా
తరంగమై ఎగసిపడుతుంది

నిర్దిష్ట నియమాల దారులేవీ
నిర్మించుకోదు
ఏ తిరానికీ దిక్సూచి కాదు
కలై
కన్రెప్పల అద్దంపై వాలి
పొడుస్తూనే వుంటుంది

రెప్పతెరిస్తే
కలా వుండదు పిచ్చుకా వుండదు
జ్ఞాపకమైన శబ్దాన్ని
హృదయంలోకి పిండుకోవడమే
తరంగం
పదికాలాలు దాచుకోవడమే
జీవితం

నిరంతరం
వెల్లువెత్తే తరంగాలలో
"నేను నిన్ను ప్రేమిస్తున్నాను
అని చెప్పినంత తేలిక కాదు
ఇంకా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం "

నాట్లేసిన పైరులా
యవ్వనంఊగుతోంది

ఇరువురొక్కగానమై
రేపటి పంటై ఫలించాలి