Monday, September 26, 2011

పరవశ నయనాల ప్రేమ



ప్రేమ
దేన్ని ఇష్టపడుతుందో!
దేన్ని ప్రేమిస్తుందో!
రూపాన్నో!
లక్షణాల్నో!
స్థితిగతుల్నో!
శారీరక ఆకర్షణనో!

మేనిచాయ
మనసును మెరిపిస్తుంది
అంగ సౌష్టవం
కనులను కలవర  పెడ్తుంది
వ్యాపార ప్రపంచం
వనరులన్నీ వొలకబోసి
ఆకర్షించి బ్రమింప చేస్తుంది

శరీర ఆత్మ సౌందర్యాల
ఆంతఃర్యమెరుగని
యౌవ్వన ప్రాయంలో
రేకులువిచ్చిన ప్రేమభావం
సన్మోహన పరిచే
సౌందర్యాన్ని వెదకుతుంది

***

మొలకెత్తే అంకురాల్ని
కనుగొన్న శాస్త్రవేత్తల్లా
చిగురుతొడిగే జీవితానికి
అదను పదునులేవో తెలుసుకున్నట్లు

నిశ్శబ్దాన్ని చీలుస్తూ
గుప్పెడు భావాలతో
హృదయాలు తరచుకుంటూ
భావాలను మార్చుకుంటూ

కలల కంటున్న లోకంలో
పాన్పులేవో పరచుకుంటూ
మాటలను గింజలుగా
జీవననారుమడులకోసం
చల్లుకుంటున్నట్లు

తపన ఉద్వేగం
కాలునిలువని కేరింత
వయసుకది కవ్వింత
తనువుకే గిలిగింత

సాధించినదేదో
మిగిలిపోయిందేదో
విజయగర్వం
పులుముకున్న దీప్తితో
శిఖరాల ఆధిపత్యపు
దారులు వెదక్కుంటూ
అలుపెరుగని
అనంత పయనాల కోలాహలం
పరవశ నయనాలతో
ప్రేమజంటలు
***

Friday, September 23, 2011

ప్రేమ తరంగమేదో తడిపేస్తుంది


ప్రేమ తప్ప మరేదీ లేదంటూ
ఒంటరి జీవితాలు
జంటవుతున్న వేళ
కోయిలలై పడాలి
మరో వసంత గీతాన్ని

పురివిప్పి నాట్యమాడాలి
హృదయతరంగాల ప్రేమిక సంగీతాన్ని

తొలకరిజల్లుల పులకరింతల
హరివిల్లులై విరియాలి

తనువంతా తడిసిన వర్షంలో
తడిసి తడిసి ఆడాలి
* * *

ప్రేమ వ్యక్తిగతావసరమై
ప్రేమ పరస్పరావసరమై
ప్రేమ సామాజికావసరమై
జీవితమంతా అల్లుకుపొతుంది

ప్రేమ తపనతో
కుర్రతనం కొత్త పేర్లు వెదకుతుంది
కొత్త భాష్యం నేరుస్తుంది
పలికే ప్రయత్నంలో
మనసు మొరాయిస్తుంది
పదాలు లేక పదం తడబడుతుంది
ఉద్వేగ తన్నుకొస్తుంది

తూనిగల్లా పరుగులెత్తే పిల్లలు
గసతీరకముందే చెపాలనుకున్నదేదో
వగర్చుతూ చెబుతున్నట్లు
ఉద్వేగమైన అలల సవ్వడితో
దేహం తేలుతుంటే
కళ్ళలోంచో పెదవుల్లోంచో
ధ్వనించే గుండె చప్పుళ్ళు
తడిపొడి పెదవులు
ఆకలి తెలియని ఆరాటం
కునుకెరుగని ఎదురుచూపు
చందన మద్దిన పరిమళ మయం

రైలు ఇంజనులోని రాకాసిబొగ్గు
రగులుతున్న జ్వాలల్లో
తన్మయమో
తమకమో
తీరమెరుగని ఈదులాట
* * *

మాటలు ముడివేసి
ధ్యానంతో పూసలు లెక్కపెట్టినట్టు
పసిపిల్లలు పాలపీక చప్పరించినట్లు
పెదాలు కదుపుతూ
"'నేను నిన్ను ప్రేమిస్తున్నా"
అన్నంతనే తెరలేస్తుంది

అవుననగానే
శాంతమైన మనస్సు రెక్కలుచాపి
క్షణ క్షణ విహంగ వీక్షణం
అయస్కాంత క్షేత్రంలో  రేఖల్లా
సంబంధలేవో
వొకదాని వెంటొకటి
అంతర్ముఖంగానో
బహిరంగానో వచ్చిపడతాయి
తరంగమేదో  తడిపేస్తుంది

రెండు ముఖాలుగా చీలిన
గుమ్మాలకీ కిటికీలకూ
పరదాలు తగిలించబడతాయి

రెపరెపలాడుతున్న పరదాల్లోంచి
మొహానికి
రంగద్దటం మొదలౌతుంది

విజయగర్వమేదో
పొడచూపుతుంది
కొత్త విజయాలకు
పగ్గాలను వెదకుతుంది
***