Tuesday, October 25, 2011

ప్రేమాంతరంగం - సంఘర్షణ తికమకపడే ప్రేమజంటలు


అనురాగపు రూపమేదో
బోసినవ్వులతో
వెన్నముద్దలు కురిపిస్తున్నప్పుడు
పాక్కుంటూ
అడుగులేసే పాదాలను
పువ్వుల్లా ముద్దాడాలని
హద్దులు చెరుపుకుంటూ
ఎగిరొచ్చే పక్షుల్లా పెద్దలు

లాలించే పసితనానికి
సహకారం అనివార్యమై
కదిలేదైనందినానికి
పనితోడవసరమై

అవసరం
అనివార్యాల నడుమ
సంఘర్షణ
అనురాగాలో
ఆత్మీయతలో
ఆసరా చేస్కొని
కొత్తరాగాలను కూర్చుతూ
నిశ్చలనీటిపై
వలయాల వలయాలుగా
సరికొత్తబంధాలతో
బిందువులేవో రాలుస్తుంటే
అర్థంకాని భవిష్య నిర్మాణపు
పునాదులేవో తవ్వుతూ
ప్రేమజంటలు

****

అప్పుడప్పుడూ
విడదీసే
భౌతికాకృతి తేడాలు
ఋతుక్రమంలో మారుతుంటే
అరోగ్య అనారోగ్యాల మధ్య
శరీరం వూగిసలాడుతూ
మారే శరీర రసాయనాల్లోచి
అనుమానం పొడచూపి

కదలికల స్పర్శలను
తూకంవేస్తూ
పడికట్టురాళ్ళేవో వెదకుతూ

సంఘర్షించే ఆలోచనల్తో
మానసికమో

శరీర మార్పుల్తో
వైజ్ఞానికమో

సామాజిక అసమానల్తో
సాంఘికమో

అంతఃవిభేదాల్తో
కుటుంబమో

అవసరాల్తో
ఆర్థికమో

ఒకదాని వెంబడి వోకటి
ఒకదానితో వొకటి పెనవేసి
ఒక్కసారి ఆనంద కెరటాలై
మరొక్కసారి
జీవనం అగాధమై
ఎదురౌతుంటే

ప్రేమనే సందేహిస్తూ
తికమకపడే
ప్రేమజంటలు

Monday, October 24, 2011

ప్రేమాంతరంగం - ఒంటరి ప్రవాహాల


ఎప్పుడూ
పరస్పర సన్నిధికోసం
ఒకరికొకరు పరితపిస్తూ
దేహపు రేకల్ని విప్పటానికి
ఏ చికట్లోనో పెనవేసుకుంటూ
మాటలకోసం
మగత మగతగా కళ్ళుతెరిస్తే
నా ప్రక్కన నీవుండవు
ని ప్రక్కన  నేనుండను


నేత్రాలను ఆత్రాలు చెయ్యబొతూ
చటుక్కున రింగుటోన్లైపోతుంటే
రాత్రి తీరని సలుపేదో
ఇంకా మూల్గుతూ  వేధిస్తుంది

ఎవ్వరు సడిచెయ్యని
ఏకాంతంలోకి
మనం పారిపోవాలనుకుంటాం
ఏమూలదాక్కున్నా
వెతికే డాలర్ కన్ను
బందీల్నిచేసి
మరిన్ని రింగుటోన్లి
బహుమతిగానే తీసుకుంటూనే

వేళ్ళూనిన సాంప్రదాయాల్ని
దాటాల్సినప్పుడు
భద్రంగా దాచుకున్న
సంప్రదాయాల్ని కూలుస్తున్నట్టు

నిలదీసే చూపుతో
కుటుంబం సమాజాల మధ్య
విసరే వడగాల్పుల్లో
నేరస్తుల్లా
చెయ్యరానిదేదో చేసినట్టు

 స్వేచ్చకోసం నలిగి
పోరాడి
సరికొత్త నిర్వచనాలు
ఆవిష్కరిస్తూ
స్వప్నాన్ని వాస్తవీకరిస్తూ

ఎదురయ్యే సమస్యల
యుద్ధాన్నో
యుద్ధతంత్రాన్నో
ఎదుర్కొంటూ
ఒంటరి ప్రవాహాల ఈదులాటలో
ప్రేమజంటలు

Saturday, October 22, 2011

ప్రేమాంతరంగం - జీవిత రహదార్లను వెదక్కుంటూ


భావాల కిటికీలు మూసి
బాధ్యతల ద్వారాలు తెరిచి
ఉరుకులు పరౌగుల
జీవిత రహదార్లను వెదక్కుంటూ
జీవన యాతనల్ని
నేర్చుకుంటున్నప్పుడు
 తేలికగానో
కష్టంగానో
కన్నీటితోనో
అనుభూతులను నేర్చుకుంటూ
ఆనందాలను నిర్మించుకుంటుంటే
ఊహల్లో కలలుకన్న లోకం
వాస్తవాన కానరాక
తికమకపడ్తున్నప్పుడు
బంధువులో
స్నేహితులో
పరిసరాలో
సాంస్కృతిక వర్గవిభేదమో
సూదులుగుచ్చే నాల్కలతో
హృద్యాంతరంగాన్ని
లోలోకి పిండుకుంటూ
ఎదురయ్యే
ఆర్థిక నిరంతర రణగొణల మధ్య
రహస్య సంకేతాలను
పదిలపర్చుకుంటూ
ప్రేమజంటలు

Friday, October 21, 2011

అనురాగాలు






అభినందన పూలవర్షం

విమర్శ అంపశయ్య
అన్నీ క్షణికాలే

ఎక్కుపెట్టేవాళ్ళకు గురితొ పనిలేదు
వాళ్ళున్నట్టే
అందరూ వుందాలనుకోవడం
ఎవరు పోతున్న రహదారి
వారి సొంతమైనట్టు
న్సడకేదో నేర్పాలని ఆరాటం

ఎవరికివారే
జీవిత పరమార్థ ప్రభోధకులైనట్టు
ప్రభోదాల పల్కులు
వింటూ ఎదుర్కొంటూ
కాల ప్రవాహంలో కలిసేవాళ్ళు
ఏ వొడ్డుకొచేరి కనుమరుగౌతారు

ఎదురీదేవాళ్ళు
వేసవి ఉక్క్పొతల
దారుల్లోకి నెట్టబడుతున్నట్టు
ఉక్కిరిబిక్కిరై
చిరచిరలాడించే చెమటల్లో
విసిగిపోతున్నట్టు
ప్రేమజంటలు


అనురాగాలు పెనవేసి
కేరింతలు తుళ్ళింతలు
కొత్త స్వప్నాల ద్వారాల్ని తెరుస్తూ
సుందరవనవిహారాలు

అనురాగాల్ని ముడివేసి
దారపుకొసేదో వెదకుతున్నట్టు
అనుభూతుల స్పర్శలు
అనుభవాలు
స్వర్గపు అంచులేవో తాకుతున్నట్టు

దేహంనుంచి దేహానికి
నరాన్నుంచి నరానికి
ప్రవహించే కాలం ముంగిటిలో
నడకలు పరుగులౌతాయి
పరుగులు నడకలౌతాయి
జీవిత గమనాంకి మలుపులౌతాయి
అనుబందాలకు పునాదులౌతాయి

దాచుకున్నదేదో
దోచుకున్నదేదో
దాగిన నిశ్శబ్దమేదో

జలపాతాల హోరులో
కేరింతల స్నానమాడుతున్నట్టు
కాలాన్ని బందించే
కొత్తసూత్రమేదో కనుగొన్నట్టు

ఎన్నో ఏండ్ల నడకను
ఏడడుగుల్లో
వెనక్కు తెచ్చుకున్నట్లు

తొడుక్కున్న ఉంగరాల్లొంచి
ప్రక్కటెముకగా అతుక్కుపోతున్నట్టు

పలవరింతలతో
ప్రేమజంటలు

Thursday, October 20, 2011

ప్రేమాంతరంగం - కని పెంచినవారి కలలు చెదిరినప్పుడు


కని పెంచినవారి
కలలు చెదరి
కల్లలైపోతున్నప్పుడు
పరస్పరావగాహన కరువై
విరోధులై ఎదురు నిలుస్తారు

కూలిన ఆశాసౌధాల మధ్య
ఇరుక్కుని
అప్పటివరకూ
పెంచుకున్న ఆత్మీయతంతా
వర్గాలుగా చీలిపోతుంది

గాయపడిన మనసు
సంఘర్షణ సమస్యలు
ఒక్కుమ్మడిగా పుట్టుకొచ్చే వుసుళ్ళుగా
రాత్రి దీపకాంతిని చుట్టి
నిర్జీవాలై
ఉషోదయ కాంతిలో వూడ్చబడతాయి

కనిపెంచినవారి
కలలు చెదిరి
కల్లలైపోతున్నప్పుడు
మెడలువంచే
కన్పించని అంశమేదో
రాజీ చేసి
నిశ్శబ్దంగానో
సహకారులుగానో
నిలబెడ్తుంది

నవొదయంలో
మౌనాన్ని మునిపంటనొక్కి
రంగులద్దిన
గువ్వల జంటలై
కొత్త రాగాలాపనకై
ఎదురుచూస్తూ
వొంటరిగానే
రెప రెపలాడే ప్రేమజంటలు

Monday, October 17, 2011

ప్రేమాంతరంగం - పెళ్ళంటే


పెళ్ళంటే
రెండు వ్యక్తిత్వాల నడుమ వారథి
రెండు కుటుంబాల అంతఃప్రవాహం

పెళ్ళంటే
బంధాల మడతబందుల పనితనం
కిటికీలుగానో
తలుపులుగానో
తమను తాము బిగించుకోవడం
పెళ్ళంటే
కాలం తీస్తున్న కెమేరాల్లోంచి
పలుకరించే వర్ణచిత్రం

ఏ కోణంలో
ఎవరు క్లిక్ చేస్తారో?
నిలువుగా వస్తుందో?
అడ్డంగా వుంటుందో!
మూల్లలకు
భావాల మేకులెవరు కొడతారో!
ఖాళీలకు ఆత్మీయ 'గమ్మె ' వరు పూస్తారో!

ఏదీ ఖచ్చితం కాదు
ఏదీ నిశ్చయంలేదు
అంతా తయారైన ఫ్రేములో
ఎవరు నిల్చి అగుపిస్తారో!

మారే ఫ్రేముల నడుమ
కాలమే నిలువుటెత్తు
నిశబ్దసాక్షి

పెళ్ళిసందడొక  సాకు
ఆత్మీయతలో అనుబంధాలో
ఒక్కచోటచేర్చే
కలబోతల ద్వారం

ఆడంబరాల అంతస్తునేదో
ప్రదర్శించే మార్గం

పీతాంబరాలు
కర్పూరదండలు
సాంప్రదాయాల తోరణాలు
పసుపు వాసనలతో
నిలుపుకున్న సంసార బంధం
ముత్తైదువుల ముచ్చట్ల మధ్య
దీవెనలకోసం
అక్షతలు చల్లే చేతులను
సాక్షులుగా నిలపడం

మోయాల్సిన కాలానికి గుర్తుగా
మెడలో దండలతో
ఆశీర్వాదాలను స్వాగతిస్తూ
ప్రేమజంటలు



Thursday, October 13, 2011

ఆశల తుమ్మెదలై ప్రేమజంటలు

అప్పుడప్పుడూ
ప్రేమ
నిగ్గుదేరిన బుగ్గలపై
రాజకీయమద్దుకొని
మేలిముసుగు ధరించిన
వధువై
కొంగు తాకుతూ పోతుంది

సొంగకార్చేవారినెల్లా
లుంగలుచుట్టి లేపుకుపోతుంది

ఇక అంతా కల్లోలమే
ఇల్లు గాయపడుతుంది

దేహం
గాయాలమయమై
ప్రేమ పావురాలు
కువకువమంటాయి దిగులుతో.

అక్కడక్కడ
ప్రేమ ముసుగులో తొడేళ్ళుంటాయి.

కండలుచీల్చే
జాగిలాలుంటాయి.

గ్రహించని హృదయాలపై
దాడి జరుగుతుంది

వెంటాడి వెటాడి
రక్తమాంసాలను బలికోరుతుంది.

అనుభవంలేని వాస్తవాలతో
ఆదమర్చితే
తీరంతెలియని
తుఫాను భీభత్సంలో
చిక్కుకొనే జీవితాలు

కొన్ని కలలు
జీవిత నిర్వచనాలు
పరుగులెత్తే మైదానాలలో
ఆశల తుమ్మెదలై
ఎగురుతూనే ప్రేమజంటలు

Tuesday, October 4, 2011

నిరంతర శబ్దం

పొంగే తొలివయస్సు ఊహలకు
రంగులద్ది
భూతద్దంలో కనిపించే
నురగల నురగల
ఆహ్లాదాన్నో
ఆనందాన్నో
అంతస్తునో
సౌందర్యాన్నో
జీవితాలకు మెరుగులద్ది
దారులను విప్పిచూపేందుకు
దార్శనికత అవసరం

ఎక్కడ్నించి వస్తుంది?
నిరంతర శోధన

ఇరువురు
ఒక్కటయ్యే యోగంలో
కొందరి లాలనలు
మరికొందరి పాలనలు
అభ్యర్థన వెల్లువ
సమర్థనల జల్లు
నిట్టూర్పుల సెగలు
విభేదాలు
ఆశలు
ఆత్మస్థైర్యాల మధ్య
నిరంతర శబ్దం
విసర్గలుగా చీలిన సంగీతం
కొత్త గీతాన్నేదో ఆలపిస్తుంది.

Saturday, October 1, 2011

ప్రేమాంతరంగం




కలలు కనడం
ప్రేమించిన ప్రియులకోసం
ఎదురీదడం కొత్తకాదు

జీవితం ప్రవాహాలైపోతున్నప్పుడు
ఎదురీదడం సాహసమే!

నకనకలాడిన ఆకలి పేగులు
ఈ దారిలో వొలికిన కన్నీళ్ళు
కొత్త జవసత్వాలనిస్తాయి

ప్రేమలో కొత్తదనమేమీ లేదు
నాల్గు నయలాలో
రెండు హృదయాల స్పందనో కాదు
ప్రేమించే హృదయానికి
ద్వారాలు విశాలం చేయటం తప్ప

ఎవరికి వారే వేసే అడుగులు
జీవితసారాల పాదముద్రల్ని
జ్ఞాపకం చేస్తుంటాయి సుమా!

* * *

పత్రహరితం కోసం
ఆకులైనప్పుడు
అజా పిలుపు మేల్కొలుపుతుంది

సూర్యుడో నీతి సూర్యుడో 
రథమెక్కో మోకరించో ఎదురౌతారు

కువకువలాడే పిట్టల్లా
ఆలోచనలు రెక్కలు విప్పుతాయి

ఎదురౌతున్నదంతా విశాలమే
ఆడించాల్సిన రెక్కల సత్తువే లెక్క

నిన్నటి జ్ఞాపకమై మిగలాలంటే
ఒంటరిగా పారిపో
ఎందరో
ఆహ్వానం పల్కడానికి
సిద్దంగా వుంటారు

రేపటి కాంతై వెలగాలంటే
సమూహాల్లోకి చొరబడు
అందరూ
విమర్శించే వాళ్ళే ఎదురౌతారు

ఎదుర్కొంటూ ఎదుర్కొంటూ
పుటంవేసిన బంగారమై
ఎదురయ్యే
రంగురంగుల లోకంలో
జంటలు జంటలుగా
ప్రేమజంటలు