Saturday, November 5, 2011

నవ్యరాగ ఆనందమయ గీతమౌతుంది

అడుగుల బంధంతో
కలిసి నడుస్తున్నప్పుడు
కనులేవొ కుడుతుంటాయి

మమకారాల మధ్య
కారం చల్లి
వినోదిస్తుంది లొకం

తరంగమై విరిగిపడినా
తీరంచేరినా
ఎగసిపడటమే ముఖ్యం

ప్రేమికులొక్కటై
అనుబంధాలకు
మరొ పేగుబంధాన్ని ముడివేయాలి

ప్రేమకు ప్రేమ తప్ప
మరేదీ సాటిలేదని
లోకానికి ఛాటిచెప్పాలి
సముద్రమైన ప్రేమను
జొంటగా ఈదుతూ
ఎవ్వరెరుగని
లోతులను కనుగొని
రహస్యాల్ని వెలికితీసి
వెదజల్లాలి దారుల నిండా.

ప్రేమిస్తున్నానని కాక
ఇంకా ప్రేమిస్తున్నానని
ఎప్పుడైనా
ఎక్కడైనా చెప్పగలగాలి

ప్రేమ కథలకు
కొత్తముగింపు వాక్య మవ్వాలి

కెరటాలై ఎగసిపడుతుంటే
మొదలు ముగింపుల మధ్య
కణాలతో సతమతమయ్యే
ప్రేమజంటలు

* * *
ఓ చెలీ
ఓచెలికాడా!
విభేదంమొలకెత్తినప్పుడు
ఒంటరితనం
అజ్ఞాతమిత్రుడై ఆహ్వానిస్తుంది

కరచాలనమో
కౌగిలింతో కొరుతుంది

నీ స్పర్శలేని భుజంపై వాలి
బరువెక్కి బరువెక్కి
వర్షించలేని కన్నుల్లో దాక్కుంటుంది

అంతటా
నైరాశ్యపు రంగు పులుముకొని
నిన్ను దూరంచేస్తుంది
నీ నుంచి నిన్ను దూరంచేస్తుంది

నీ స్పర్శకోసం
ఆ భుజం ఎప్పుడూ
ఖాళీగానే
సాదరంగా ఎదురుచూస్తుంది.
***

వేర్వేరు భావాలతో
విహరిస్తున్నప్పుడు
పరస్పరం
సంఘర్షిస్తూనే వుంటుంది కాలం

నిదురలేచి
పక్క దులిపినట్టు
భావాల్ని దులపాల్సిందే

ఒక్కసారి మనసు తెరచి
ఒకొక్క మాటను పాటచేసి
పాడాల్సిందే!

జ్ఞాపకాలు వర్షించే కనులై
కొత్తగీతాన్ని ఆలపించాల్సిందే!

ధృడమయ్యే బంధం కోసం
స్పర్శించాల్సిందే!

* * *

ఇప్పుడభినందిస్తున్న వాళ్ళ
ద్వేషిస్తున్న వాళ్ళ
ముఖాల రంగులు మార్చడం
జయాపజయాల పోరాటం

విజయాల ంధ్య
అందరు సన్నిహితులే
తోడెవ్వరూలేని ఓటమిలో
మిగిలేది
జంటలమధ్యవున్న
ప్రేమ స్పర్శ మాత్రమే!

ఆటుపోటుల సమరంలో
కడదాకా నిలిచి
కంపించే జంటలు
పొంగిపొర్లే సెలయేర్లులా
మోసుకుపోతున్న విధ్య్తు తు  ప్రవాహం
యెదనుండి యెదకు
తరంనుంచి తరానికి
వారథిచేస్తూ పాడినప్పుడే
ప్రేమగీతమైన జీవితం
చిరుకొమ్మల చిగురుల్లో
ఊయలూగే
చిలకలుపాడే కిలకిలరావాల
నవ్యరాగ ఆనందమయ గీతమౌతుంది

4 comments:

  1. ప్రేమే మనల్ని నడిపించేది..చాలా బాగా చెప్పారు

    ReplyDelete
  2. చాలా బాగా చెప్పారండీ.. మరిన్ని కవితలని మీనుండి ఆశిస్తున్నాను..

    ReplyDelete