ఎవరినైనా ప్రేమించాలి
అచేతనపు బీడుల్లో
వొంటరితనాన్ని ఈదుకుంటూ
చేతనాలింగన
ఎదురుచూపుల కోసం
ఎడారి ఇసుకల్లోంచి
జారిపోయిన వసంతాలు
వెదలేని కన్నుల్లో
ఖర్జూరపు తీపికోసం
ప్రవాహ తీరాలకోసం
***
ఎవర్ని ప్రేమించాలి?
ఎప్పుడు ప్రేమించాలి?
ఎలా ప్రేమించాలి?
వ్యక్తపరచలేని ప్రేమభావం
విచ్చుకోని మొగ్గౌతుంది
చూపులు కలిసిన శుభఘడియేదో
ఆత్మలను కలుపుతుంది
గాలి చొరబడని కౌగిలింతేదో
బందీల్ని చేస్తుంది
***
పరిమళించిన పథాలలో
నడిచారో, పరుగెత్తారో, అలసిపోయారో
స్విచ్ వేయగానే గిర్రున తిరిగే ఫేనులా
కాలమేమి తిరగదు
ఒకరికొకరుగా ప్రీతిచేయడానికి
మనకు మనంగా శృతిచేయడానికి
మధ్య మధ్య ప్రవేశిస్తూనే వుంటుంది
వడిసి పట్టుకోవడం
మెలిపెట్టడం
సహనాన్నో బందాన్నో పరీక్షించడం
నడిపించడం పరుగులెత్తించడం
ఏడ్పించడం నవ్వించడం
దూరం చేయడం దగ్గరవ్వడం
కళ్ళలో కలలు నింపడం
దానికి వెన్నతో పెట్టిన విద్య
ఎవర్ని గెలిపిస్తుందో
ఎవర్ని ఓడిస్తుందో
బహుశ
తను అలసినప్పుడు
మరో జంటను వెతుకుతుంది
దాని వెతకడం ఆ జంట వంతౌతుంది.
baagundi
ReplyDelete